aBOUT OUR SCHOOL





 

మన పాఠశాల గురించి ...... 

     పావులూరు పరిసర గ్రామములైన బూదవాడ, కల్లంవారిపాలెం, మల్లవరం, ఆరికట్లవారిపాలెం, నక్కలపాలెం, నాగండ్ల, సూదివారిపాలెం, చింతలపాలెం, తాటిపర్తివారిపాలెం, గంగవరం మున్నగు గ్రామములందలి వారలకు విద్యాభ్యాసమునకు తగు వసతులు లేక ఇబ్బంది పడుచుండగా 1951లో పావులూరు గ్రామపెద్దలు సమావేశమై పావులూరు గ్రామమునందొక పాఠశాల ఏర్పాటుచేయ సంకల్పించారు. 1942 వ సంవత్సరములో మద్దులూరి శేషాచలపతి రావు గారిచే నిర్మించబడిన ధర్మసత్రమును పాఠశాల ఏర్పాటు కొరకు కోరగా ప్రజల కోరికను మన్నించి ధర్మసత్రమును పాఠశాల ఏర్పాటునకు ఇచ్చుటకు అంగీకరించారు.
        తేది. 04.07.1951 వ సంవత్సరములో ఏలూరి రాఘవయ్య చౌదరి గారు రూ. 5000లు విరాళము మరియు నాటి గ్రామాధికారులైన శ్రీయుతులు మద్దులూరి వెంకట సుబ్బారావు(గ్రామకరణం) మరియు శ్రీయుతులు గాదె వీరారెడ్డి (గ్రామమునసబు) గార్ల సహకారముతో 5 ఎకరముల గ్రామకంఠం భూమిని సేకరించి ఆనాటి విద్యాశాఖ డైరక్టరైన శ్రీ సంజీవభట్టు గారి ఉత్తర్వులతో మిడిల్ స్కూల్ ప్రారంభించడమైనది.
                     

కీ .  శే .   మద్దులూరి వెంకట సుబ్బారావు గారు 

కీ.శే .  గాదె వీరారెడ్డి గారు 

        ఆనాటి పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయులు శ్రీ మంచెళ్ల వెంకటేశ్వరరావు గారు. మరుసటి సంవత్సరము అనగా 1952వ సంవత్సరములో శ్రీ గాదె వీరారెడ్డి (గ్రామమునసబు) మొదలగు గ్రామపెద్దలు విశేషకృషి చేసి గుంటూరు జిల్లా బోర్డునకు రూ. 15,000/- లు కార్పస్ ఫండ్ సమకూర్చారు.
      ఆ నిధితో బాటు శ్రీయుతులు నీలం సంజీవరెడ్డి, శ్రీ కాసు వెంగళరెడ్డి, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గార్ల సహాయ సహకారములతో మిడిల్ స్కూలును సెకండరీ పాఠశాలగా అప్ గ్రేడ్ చేసుకొనుట జరిగినది.
      ఆనాటి ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.వి.సూర్యప్రకాశరావు గారు. వీరి కాలములో పాఠశాల విద్యార్థుల సంఖ్య దిన దినాభివృధి చెందినది.
       1955-56 విద్యా సంవత్సరములో ప్రభుత్వమునుండి రూ. 20,000/- లు గ్రాంటు వచ్చినది. భవన నిర్మాణ నిమిత్తము శ్రీ బాచిన తాతయ్య గారు అధ్యక్షులుగా,  శ్రీ గాదె వీరారెడ్డి గారు కోశాధికారిగా, శ్రీ మద్దులూరి సుబ్బారావు గారు, శ్రీ పముజుల శేషగిరిరావు గారు, శ్రీ ఏలూరి సారంగయ్య గారు, శ్రీ సంకా సుబ్బారావు (పెద్దశెట్టి) గార్లు ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వ నిధికి తోడు కారంచేటి వాస్తవ్యులు అయిన శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి గారి కుమారుడు బంగారుబాబు గారి ఆర్ధికసహాయముతో దక్షిణము వైపు నాలుగు గదుల నిర్మాణము జరిగినది.
             

కీ.శే.బాచిన తాతయ్య గారు 

కీ .శే .యేలూరి  సారంగయ్య గారు 

      1962-63 వ సంవత్సరములో పలపల కనికిరెడ్డి గారు రూ.5,000/-  లు ఆర్ధిక సహాయము చేయగా కమిటీ సభ్యులు చీరాల రెడ్డి గారి నుండి కొంత ద్రవ్యమును అప్పుగా తెచ్చి పడమర వైపు రెండు గదులు నిర్మించుట జరిగినది. అప్పుగా తెచ్చిన ద్రవ్యమును తీర్చుటకు  గాను శ్రీ గాదె భద్రిరెడ్డి గారు (నల్ల), శ్రీ బాచిన వెంకటేశ్వర్లు గారు, శ్రీ బాలిరెడ్డి వీరయ్య గారు, శ్రీ భట్టు బుల్లెయ్య గారు, శ్రీ మద్దులూరి  సూర్యనారాయణరావు గారు, శ్రీ పులఖండం వెంకటేశ్వర్లు గారు (భద్రమ్మ), శ్రీ ఆత్మకూరి నారాయణ గారు, శ్రీ పాలెపు అమరలింగం గారులు ఈ గ్రామము మరియు పరిసర గ్రామములలో విరాళములు సేకరించి రెడ్డి గారి అప్పును తీర్చుటకు తోడ్పడ్డారు.
         నాటి పరుచూరు శాసనసభ్యులు శ్రీ గాదె వెంకటరెడ్డి గారి కృషి ఫలితముగా నాటి గుంటూరు జిల్లా బోర్డు వారి ఆర్ధిక సహాయముతో శ్రీ ఆళ్ళ హనుమంతరావు గారు, శ్రీ గాదె వెంకటరెడ్డి (మునసబు) గార్ల పర్యవేక్షణలో ఉత్తరము వైపు నాలుగు గదులు నిర్మించుట జరిగినది.
శ్రీ గాదె వెంకట రెడ్డి గారు 

      1970వ సంవత్సరములో ప్రకాశం జిల్లా ఏర్పడిన పిదప ఈ పాఠశాల ప్రకాశం జిల్లా పరిషత్ పరిధిలోనికి వచ్చినది. మన గ్రామ నివాసి అయిన మాజీ మంత్రివర్యులు శ్రీ గాదె వెంకటరెడ్డి గారు నాటి నుండి ఈ పాఠశాల అభివృద్ధి నిమిత్తం నిర్విరామముగా శ్రమించి తగు వనరులకు కృషి చేస్తున్నారు.
     బాలికల ఆటల పోటీల సందర్భముగా ఆనాటి ప్రెసిడెంట్ శ్రీమతి గాదె రాజ్యలక్ష్మి గారు పంచాయితీ నిధుల నుండి రూ. 35,000 లతో ఆటస్థలపు లెవెలింగుకు తోడ్పడినారు.
      బాలికల ఆటలపోటీల సందర్భముగా నాటి జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ పాలపర్తి డేవిడ్ రాజు గారు  జడ్.పి.నిధుల నుండి ఒక లక్ష రూపాయలు, ఆనాటి ఎక్సయిజ్ శాఖామాత్యులు శ్రీ గాదె వెంకటరెడ్డి గారు తమ ఎం.ఎల్.ఏ. గ్రాంటు నుండి లక్ష రూపాయలు మంజూరు చేయగా, ఈ 2 లక్షల ఆర్ధిక సహాయముతో పాఠశాల పడమరవైపున గల స్థలము నందు ఆడిటోరియం నిర్మాణము జరిగినది.
   ఆటలపోటీల సందర్భముగా నక్కలపాలెమునకు విరాళములు సేకరించుటకు వెళ్లగా శ్రీయుతులు బాచిన తాతయ్య గారి జ్ఞాపకార్ధము వారి కుమారులు స్వచ్ఛందంగా మంచినీటి వసతిని కల్పించెదమని వాగ్దానము చేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేసినారు.
     1997-98 సంవత్సరములో ఆడిటోరియమునకు పడమరవైపు ఆటస్థలమునకు జన్మభూమి కార్యక్రమములో భాగముగా ప్రజల సహకారముతో రూ.30,000/- లతో పాటు ప్రభుత్వ నిధులనుండి రూ. 1,70,000/-లు గ్రాంటు రాగా ప్రహరీ గోడ నిర్మాణము చేసికొనుట జరిగినది. 
    1998-99 సంవత్సరములో ప్రపంచ బ్యాంకు నిధులనుండి రూ. 2,25,000/- లు ఆర్ధిక సహాయము రాగా పాఠశాలకు ఉత్తరపు వైపున అదనపు గది నిర్మాణము జరిగినది.      
          1999-2000 సంవత్సరములో నాటి విద్యాకమిటీ ఛైర్మన్ శ్రీ అళహరి సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యములో రూ.7,50,000 /- లు యస్.యఫ్.సి.నిధుల నుండి మంజూరు కాగా పాఠశాలకు పడమర వైపు ఆడిటోరియం ప్రక్కన రెండు గదులు, వాని పై భాగమున ఒక గది మొత్తము మూడు గదుల నిర్మాణము జరిగినది. 
     2001-2002 సంవత్సరములో శ్రీ చాగంటి సత్యనారాయణరెడ్డి, విద్యా కమిటీ ఛైర్మన్ గారి ఆధ్వర్యములో దేవాలయమునకు ఉత్తరపు వైపు స్థలము బాగు చేయుట మరియు మరుగుదొడ్ల నిర్మాణము జరిగినది.
         2003-04 సంవత్సరములో జరుపుకున్న బాలికల జోన్ క్రీడలు మరియు స్వర్ణోత్సవ వేడుకల సందర్భముగా జిల్లా పరిషత్ చైర్మన్ గారగు శ్రీ ముక్కు కాశిరెడ్డిగారు మరియు జిల్లా కలెక్టరు శ్రీ టి.కృష్ణబాబు గారు రూ. 1,50,000/- లు పాఠశాల భవనము వెల్ల వేసుకొనుటకు, ఆటస్థలం బాగుచేసుకొనుటకు మంజూరు చేసి స్వర్ణోత్సవ వేడుకలు విజయవంతముగా జరుగుటకు తోడ్పడ్డారు. 
       విద్యార్థులు ఆనాటి వరకు బావి నీరే మంచి నీరుగా త్రాగేవారు. ఆ నీరు దుమ్ము, ధూళి కణాలు కలగలిసి ఉండేది. ఇది చూసి మనసు చలించిన మన పాఠశాల పూర్వవిద్యార్థి శ్రీ కంచర్ల అజయ్ ప్రసాద్ తన తల్లి కీ.శే. మహలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్ధం రూ. 1,00,000/- ఖర్చుతో పాఠశాలలో R.O.ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగినది. ఆనాటి నుండి విద్యార్థులందరూ పరిశుభ్రమైన మంచి నీటిని త్రాగగలుగుచున్నారు. 
మంచి నీటివసతికై శ్రీ కంచర్ల అజయ్ ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన R.O.ప్లాంట్. 
         ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు చూస్తున్న రోజులు. మన పాఠశాల విద్యార్థులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు, ఎవరైనా మనకు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయకపోతారా అని. అలాంటి సమయములో కీ.శే. బాచిన అంజమ్మ మరియు పద్మ గార్ల జ్ఞాపకార్ధం మన పాఠశాల పూర్వవిద్యార్థి పెదనక్కలపాలెం వాస్తవ్యులు శ్రీ బాచిన  సత్యనారాయణ గారు, కుమారుడు శ్రీ  హరికిషోర్, USA, కోడలు సాయిశ్రీ, మనుమలు కౌషల్, రేయాన్ష్ రూ. 1,00,000 లతో పాఠశాలలోని ఒక గదిని డిజిటల్ తరగతిగా మార్చడం జరిగినది. 
శ్రీ బాచిన సత్యనారాయణ గారు 

డిజిటల్ గది     
        పాఠశాల గ్రామానికి చివర ఉండటం వలన పాఠశాలలో రాత్రి వేళల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నవి. అందువలన, ఉదయం పాఠశాలకు వచ్చే సరికి పాఠశాల ఆవరణలో మందు సీసాలు, పేక ముక్కలు విపరీతంగా ఉండేవి. పాఠశాల నైట్ వాచ్ మెన్ గా ఉన్నటువంటి శ్రీ ప్రత్తిపాటి నాగేశ్వరరావు గారు రిటైర్ అయినందున ఆ పోస్ట్ ఖాళీగా ఉన్నది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు పాఠశాల తాళాలు పగలగొట్టడం, దొంగతనాలు చేయడం జరిగినది. ఇది గమనించిన మన పాఠశాల పూర్వ విద్యార్ధులు శ్రీ మున్నంగి సురేష్ రెడ్డి, SANGHAMITRA HOSPITALS, శ్రీ మున్నంగి రాఘవ రెడ్డి, A.E., AP TRANSCO లు వారి తండ్రి గారైన కీ.శే. మున్నంగి నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తల్లి శ్రీమతి మున్నంగి పద్మ తరపున పాఠశాలకు రూ.50,000/- విలువైన C.C.కెమెరాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ గాదె వెంకటరెడ్డి గారు C.C. కెమెరాలను ప్రారంభించారు. నాటి నుండి పాఠశాల ఆవరణలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ఉండుటవలన విద్యార్ధులు ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించుచున్నారు.
శ్రీ మున్నంగి సురేష్ రెడ్డి, శ్రీ మున్నంగి రాఘవ రెడ్డి లను సన్మానిస్తున్న శ్రీ గాదె వెంకటరెడ్డి గారు, ప్రధానోపాధ్యాయులు శ్రీమతి గిరిజ గార్లు
        
         తాము చదివిన పాఠశాలకు ఏదైనా చేయాలనే తలంపు 1987-88 పదవ తరగతి విద్యార్థులలో కలిగి వారి తరపున శ్రీ పులఖండం భాస్కర రెడ్డి, శ్రీ షేక్ సుభాని, శ్రీ చాగంటి కోటిరెడ్డి, తదితరులు ప్రధానోపాధ్యాయురాలిని కలవగా తరగతి గదులకు ఫర్నిచర్ ను అడిగినారు. పాఠశాలలో తరగతి గదులలో  అవసరమైన 10 బల్లలు మరియు 10 కుర్చీలను సుమారు రూ. 50,000/- లు ఖర్చు చేసి తయారు చేయించారు. 
పాఠశాలకు 10 టేబుల్ మరియు 10 కుర్చీలను అందజేస్తున్న 1987-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మకూరి  సుబ్బయ్య,  పులఖండం అంజిరెడ్డి, చాగంటి కోటిరెడ్డి, షేక్ సుభాని తదితరులు. 
            సాధారణంగా ప్రభుత్వపాఠశాలకు వచ్చే విద్యార్థులు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో వస్తూ ఉంటారు. తల్లి దండ్రులు వారి వ్యవసాయ మరియు ఇతర పనులతో బిజీగా ఉండి వారి పిల్లల ఆరోగ్య పరిస్థితులను పట్టించుకొనే పరిస్థితి ఈనాటికీ గ్రామాలలో ఉండుటలేదు. అంతేగాక ఇంటివద్ద కూడా సమతుల్య ఆహారం పిల్లలకు పెట్టే పరిస్థితి ఉండుటలేదు. ఇందువలన విద్యార్థులు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలలో సర్వే చేసి  ఈ విషయాన్ని గ్రహించి విద్యార్థులకు పోషక విలువలున్న ప్రోటీన్ పౌడర్ ను అందజేయాలని తద్వారా పిల్లలకు  ఆరోగ్య భద్రత కలిగించేలా  మరియు ఆడపిల్లలను ప్రస్తుత సమాజంలో మగపిల్లలకు ధీటుగా ఎదిగేలా వారికి శిక్షణను ఇవ్వడం, చిన్న వయస్సులో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను చూపించడం, విద్యార్థులందరూ మానసికంగా ధృడంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో శిక్షణను ఇప్పించడమే లక్ష్యంగా డాక్టర్. దుంపా శ్రీదేవి గారు (శ్రీ గాదె వెంకట రెడ్డి గారి కోడలు) అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ ను స్థాపించి రాష్ట్రం లోని అనేక పాఠశాలల విద్యార్థులకు  ప్రోటీన్ పౌడర్ ను అందజేస్తున్నారు. దానిలో భాగంగా మన పాఠశాల విద్యార్థులు 304 మందికి  కూడా అందజేయడం జరిగినది. విద్యార్థులకు మానసిక వికాస నిపుణునిచే శిక్షణను ఇప్పించుట జరిగినది. వైద్యులచే ఆడపిల్లలకు ఆరోగ్య సలహాలు ఇప్పించుట జరిగినది. ఇందుకొరకు షుమారు రూ. 1,00,000 లను వెచ్చించుట జరిగినది. 

అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ డా. దుంపా శ్రీదేవి గారు 
కార్యక్రమం గురించి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గిరిజ గారు 

        వీరే గాక, ఎంతోమంది గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధిలో నిరంతరం తమ సహాయాన్ని అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుచున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి తరగతిలో ప్రధమ, ద్వితీయ స్థానాలను సాధించిన విద్యార్థులకు తమ వంతుగా బహుమతులు అందజేస్తున్నారు. మరికొంతమంది కొంత సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చు వడ్డీని బహుమతులుగా అందజేస్తున్నారు. 
          
          "ఎందరో మహానుభావులు అందరికీ వేల వేల వందనాలు"

      ఇంత మంది నిరంతర కృషితో 1951 సంవత్సరములో సుమారు 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు 304 మంది విద్యార్థులతో అభివృద్ధి పథములో పయనిస్తూ ఉంది.        


No comments:

Post a Comment